వెల్లివిరిసిన మతసామరస్యం

బులంద్‌షహర్‌ : ప్రపంచమంతా కరోనా ధాటికి గడగడ వణుకుతున్న వేళ మానవత్వానికి ఆలంబనగా నిలిచిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో వెలుగు చూసింది. ఆపత్కాలంలో ఆయువు తీరిన నిరుపేద హిందూ మతస్థుడి అంత్యక్రియలకు అయినవారు రాలేకపోయిన వేళ సాటి ముస్లింలు మానవత్వం ప్రదర్శించి మతసామరస్యం చాటారు. మతాల అడ్డుగోడలను అధిగమించి ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచారు.


మానవత్వానికి, మతసామరస్యానికి అద్దం పట్టిన ఈ ఘటన బులంద్‌షెహర్‌లోని మౌలానా ఆనంద్‌ విహార్‌లో చోటుచేసుకుంది. రవిశంకర్‌ అనే వ్యక్తి క్యాన్సర్‌ వ్యాధితో ఆదివారం మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేకపోయారు. నిరుపేద కుటుంబం దీనావస్థను గమనించిన చుట్టుపక్కల ముస్లింలు.. రవిశంకర్‌ అంత్యక్రియల్లో సాయం చేశారు. స్వయంగా పాడె మోసి మృతదేహాన్ని శ్మశానికి తరలించడంలో సహాయపడ్డారు. భౌతికకాయాన్ని తరలించే సమయంలో 'రామ్‌ నామ్‌ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ మతసామరస్యాన్ని చాటారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు.